Fog Effect: పొగ మంచు ప్రభావంతో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం...! 2 d ago
దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. పొగ మంచు ప్రభావంతో విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లంబసింగిలో ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.ఏపీలో చలి పంజా కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆంధ్రా కశ్మీర్ లంబసింగిలో ఐదు డిగ్రీల కంటే కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఉదయం ఏడు గంటల వరకు పొగ మంచు ప్రభావం కొనసాగుతోంది. అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లి, పార్వతీపురం మన్యం వంటి ప్రాంతాల్లో మరింత ఎక్కువగా చలి తీవ్రత ఉంది. రానున్న 10 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.ఉత్తరాదిలో చలి కారణంగా దట్టమైన పొగమంచు అలుముకుంది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పొగమంచు తీవ్ర ప్రభావం చూపుతోంది. విజిబిలీటీ తగ్గిపోయింది. దీంతో, ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఢిల్లీకి సంబంధించి 255 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదే సమయంలో 43 విమానాలను అధికారులు రద్దు చేశారు. 15 విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. ఇక, పొగ మంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.